జానకిరాముడు

మా అమ్మ పేరు జానకి. ఆమెకి పదిహేనో ఏటనే పెళ్లయింది. ఆడ పిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసేయటం మా తాతగారింట్లో సంప్రదాయం. అదో చాదస్తపు కుటుంబంలెండి. మా అమ్మమ్మదైతే ఏకంగా బాల్య వివాహమే. ఆమెకి పన్నెండో ఏటనే తాతయ్యతో పెళ్లయింది……

మా అమ్మ పేరు జానకి. ఆమెకి పదిహేనో ఏటనే పెళ్లయింది. ఆడ పిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసేయటం మా తాతగారింట్లో సంప్రదాయం. అదో చాదస్తపు కుటుంబంలెండి. మా అమ్మమ్మదైతే ఏకంగా బాల్య వివాహమే. ఆమెకి పన్నెండో ఏటనే తాతయ్యతో పెళ్లయింది. వాళ్లిద్దరికీ వయసులో సుమారు ఇరవయ్యేళ్లు తేడా ఉంది! ఇది చూసి ఈ కధ ఏ నలభై ఏళ్ల క్రితమో జరిగిందనుకునేరు. మా అమ్మా నాన్నల పెళ్లయింది 1991లో. అమ్మకిప్పుడు నలభై రెండో ఏడు నడుస్తుంది.

పెళ్లికి ఇరవై రోజుల ముందే అమ్మ పదో క్లాసు పరీక్షలు రాసింది. ఇంకా చదువుకోవాలని ఆమె కోరిక, కానీ పెళ్లి దెబ్బకి చదువాగిపోయింది. అప్పుడే పెళ్లొద్దని ఆమె ఎంత గొడవ చేసినా తాతయ్య వాళ్లు వినలేదట. అంత చిన్న పిల్లకి అప్పుడే పెళ్లేంటని చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్లు నచ్చచెప్పినా తాతయ్య నిర్ణయం మారలేదు. అమ్మ స్కూలు హెడ్ మాస్టర్ స్వయంగా వచ్చి ‘ అమ్మాయి తెలివిగలది. చక్కగా పై చదువులు చదివించండి ‘ అని బతిమిలాడినా లాభంలేకపోయింది. అమ్మ ఇష్టాయిష్టాలతో పనిలోకుండానే పెళ్లయిపోయింది.

నాన్నకీ అమ్మకీ వయసులో పదేళ్లు తేడా. పెళ్లయ్యాక ఏడాది తిరిగేలోపే నేను పుట్టాను. రాఘవ అని పేరు పెట్టారు నాకు. మా తాత పేరది (అమ్మకి నాన్న; ఆయనంటే అమ్మకి చాలా ఇష్టం). అటు అమ్మమ్మ వాళ్లకి, ఇటు నాయనమ్మ వాళ్లకి నేనే తొలి మనవడిని కావటంతో అందరూ నన్ను గారాబంగా పెంచారు. అమ్మయితే నా మీద ఈగ వాలనీయదు. మిగతా వాళ్లు నన్ను ‘చిన్నోడా’ అంటారు. అమ్మ మాత్రం ‘నాన్నా’ అనో, ‘రాముడూ’ అనో పిలుస్తుంది.

అమ్మ వాళ్ల వైపులా కాకుండా నాన్న వైపు వాళ్లు కాస్త ఆధునిక భావాలు కలవాళ్లు. అమ్మకి ఇంకా చదువుకోవాలనే కోరిక బలంగా ఉండటంతో నేను పుట్టాక తను చదువు కొనసాగిస్తానంటే నాన్న అడ్డు చెప్పలేదు. నాకు నాలుగేళ్లొచ్చేసరికి అమ్మ ఇంటర్ పూర్తిచేయటమే కాకుండా ప్రైవేట్ గా ఇంగ్లీష్ లిటరేచర్ లో బి. ఎ. కూడా చేసింది. చదివింది బి.ఏ.నే అయినా తెలియని వాళ్లు ఆమె ఇంగ్లీష్ లో పి.జి. చేసిందనుకునేలా ఉంటుందామె మాట్లాడటం వింటుంటే.

నాన్న పేరు గురుదత్తు. నాయనమ్మకి పాత హిందీ హీరో గురుదత్ అంటే ఇష్టమట. అందుకని ఆ పేరు పెట్టారు. పి. డబ్ల్యు. సి. శాఖలో ఇంజనీర్ గా పని చేసేవాడు. అమ్మా నాన్నలది ముచ్చటైన జంట అని అందరూ అంటుండే వాళ్లు. ఇద్దరి మధ్యా సుమారు పదేళ్లు వయసు తేడా ఉండేది కానీ ఆ రోజుల్లో అది మామూలేననుకుంటా. అమ్మ చాలా అందంగా ఉంటుంది. ‘మా కోడలు పిల్లని చిదిమి దీపం పెట్టుకోవచ్చు’ అని నాయనమ్మ ఎప్పుడూ ఎవరో ఒకరితో అంటుండేది. నాన్నైతే ఏకంగా ‘హీరోయిన్’ అని పిలుస్తుండే వాడామెని.

నాకు ఎనిమిదేళ్లప్పుడు నాన్నని రాజస్థాన్ కి బదిలీ చేశారు. అక్కడేదో పెద్ద డ్యాం కడుతున్నారట. అది పూర్తయ్యే వరకూ అక్కడే ఉండాల్సి వచ్చింది. తరువాత ఎటూ వెనక్కు రావలసిందే కాబట్టి, నా చదువుకు ఇబ్బందవుతుందని ఫ్యామిలీని ఇక్కడే వదిలి పెట్టి ఆయనొక్కడే వెళ్లాడు. మూడు నెలలకో సారి వారం పది రోజుల పాటు సెలవు పెట్టి మా దగ్గరకు వస్తుండే వాడు.

నాన్న ఊరెళ్లాక చాలా రోజుల పాటు అమ్మ దిగులుగా ఉండేది. నాకు తెలిసి వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఎప్పుడూ రెండు మూడు రోజులు మించి దూరంగా లేరు. ఇప్పట్లాగా అప్పట్లో ఫోన్లు లేవు కదా. నాన్న క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండే వాడు. ఉత్తరమొచ్చిన రోజు అమ్మ చాలా ఆనందంగా ఉండేది. తర్వాతి రోజు మళ్లీ దిగులు మొదలు. నాకు మాత్రం అంత దిగులేమీ ఉండేది కాదు.

ఆ సమయంలో దిలీప్ మామయ్య మా ఇంట్లో దిగాడు. అతను మా అమ్మకు పిన్ని కొడుకు. అమ్మకి దిలీప్ మామయ్యంటే చాలా ఇష్టం. అతను అమ్మకన్నా రెండేళ్లు చిన్న వాడయినా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. చిన్నప్పటి నుండీ ఒకే చోట పెరగటంతో ఇద్దరికీ మధ్య చాలా చనువుండేది. నాన్నకు బదిలీ అయిన మూడు నెలలకు దిలీప్ మామయ్య మా ఊర్లో పి. జి. చదవటానికి వచ్చాడు.